సామాజిక న్యాయం కోసం తమ పార్టీ బహుజన్ సమాజ్‌పార్టీతో కలిసి పోరాడుతుందని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పెట్టుకున్న పొత్తు అనుకున్న ఫలితాలివ్వకపోవడం పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దిల్లీలో పార్టీ నేతలతో మాట్లాడిన మాయావతి యూపీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మాయా వ్యాఖ్యలపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ....కూటమి కొనసాగింపుపై తుది నిర్ణయాన్ని బీఎస్పీ అధికారికంగా వెల్లడించేవరకూ వేచిచూస్తామని ప్రకటించింది.
అనంతరం ఆజంగఢ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన అఖిలేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీతో కలసి నడుస్తామని స్పష్టం చేశారు. భిన్నంగా సాగిన ఈ లోక్‌సభ ఎన్నికల పోరు నైజం తనకూ అంతుపట్టలేదన్నారు. టీవీ, చరవాణిలతో మీడియా తమ మెదళ్లలోకి చొరబడి భావాలతో ఆడుకుందని మండిపడ్డారు
ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ తమ హయాంలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే భాజపా చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధిలో ఆ పార్టీ తమ ముందు నిలువలేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ భద్రతపై రాజ్నాథ్ సింగ్ సమీక్ష