సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాలకు అనుమతులు ఇచ్చింది కేంద్రం. అందుకోసం నూతన మార్గదర్శకాలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్-ఎస్ఓపీ) జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజా ప్రవర్తనలో సరైన మార్పు తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యమని పేర్కొంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
వ్యాపారాలను ప్రారంభించే ప్రయత్నాలను వేగవంతం చేస్తూ.. గురువారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రార్థనామందిరాలు తెరుచుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి తెరిచేందుకు ప్రయత్నాలు చేపట్టారు వ్యాపారులు.
నూతన మార్గదర్శకాల ప్రకారం.. కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాలు మూసే ఉంచాలని ఆదేశించింది. అలాగే.. కంటెయిన్మెంట్ జోన్ల బయట కూడా సినిమాహాళ్లు, క్రీడా మైదానాలు, మాల్స్‌లోని చిన్న పిల్లల ఆట స్థలాలనూ తెరవకూడదని స్పష్టం చేసింది. ప్రార్థన మందిరాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు వేరువేరుగా 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.