అనారోగ్యంతో బాధపడుతున్న మాతృమూర్తికి తుది గడియల్లో సేవ చేసుకునే భాగ్యం కోసం విదేశంలో చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్నఫళంగా వదిలేసి వచ్చిన ఓ వ్యక్తిని విధి వెక్కిరించింది. దుబాయ్‌లోని ఒక కంపెనీలో ఆరేళ్లుగా కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమిర్‌ఖాన్(30) భారత్‌లో ఉన్న తన తల్లి వద్దకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. తను పనిచేస్తున్న కంపెనీ ఎక్కువ రోజులు వెళ్లేందుకు సెలవు మంజూరు చేయకపోవడంతో చివరికి ఉద్యోగాన్నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. మరోవైపు తనను స్వదేశం పంపించాల్సిందిగా అక్కడి భారత దౌత్య కార్యాలయ అధికారులను రెండు నెలలుగా అభ్యర్థిస్తూనే ఉన్నాడు.
చివరికి మే 13న ఆమిర్‌కు దిల్లీ వెళ్లే అవకాశం లభించింది. అయితే దిల్లీ చేరిన అతన్ని అధికారులు 14 రోజుల క్వారంటైన్‌కు పంపారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న తన తల్లి పరిస్థితులను అక్కడి అధికారులకు వివరించి, ఎలాగైనా తనను ఇంటికి వెళ్లేలా అనుమతించమని వేడుకున్నాడు. ఇలా 8 రోజులు గడిచిపోయింది. శనివారం ఆయన తల్లి మృతి చెందిన సమాచారం తెలియడంతో ఆమిర్ గుండె పగిలేలా రోదించాడు. ఇప్పటికైనా తన తల్లి కడసారి చూపును దక్కనివ్వండని, అంతిమ సంస్కారాలనైనా పూర్తిచేయనివ్వండని ప్రాథేయపడ్డాడు. అయినప్పటికీ అధికారులు నిబంధనల పేరుతో అతనికి ఆ అవకాశాన్నీ కల్పించలేదు.
ఇదీ చూడండి: ఓ తల్లి వేదన.. తుపానులో కొడుకులను కోల్పోయి!