పన్ను విధానంలో సంస్కరణలు తీసుకురావటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దేశంలో ఏటా రూ.కోటి సంపాదిస్తున్నామని 2,200 మంది మాత్రమే ప్రకటించటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. భారత్ అభివృద్ధి కోసం పన్ను బకాయిలు చెల్లించాలని ప్రజలను అర్థించారు.
"అన్ని ప్రభుత్వాలు పన్ను విధానాన్ని ముట్టుకోవడానికే సంకోచించాయి. కానీ ఇప్పుడు మేం దాన్ని పౌరుల సౌలభ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దాం. కొంతమంది పన్ను కట్టనివారు.. ఎగవేతకు మార్గాలు వెతికే వారి వల్ల నిజాయతీగా చెల్లించేవారిపై భారం పడుతోంది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న పట్టణాలపై దృష్టి సారించిన మొదటి ప్రభుత్వం తమదేనని మోదీ తెలిపారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.