జమ్ముకశ్మీరు రాజౌరీ జిల్లా వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు గుళ్ల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. గత మూడు రోజుల్లో జమ్ము ప్రాంతంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి.
సుందర్బని సెక్టార్లో గస్తీ కాస్తోన్న భారత జవాన్లే లక్ష్యంగా దాయాది సైన్యం రెచ్చిపోయింది. ఈ కాల్పుల్లో జవాను గాయపడగా... సైనిక ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
శనివారం కూడా...
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో పాక్ బలగాలు పూంచ్ జిల్లా మెంధార్ ప్రాంతంపై దాడికి తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి.