మంగళవారం ఉదయం సురక్షితంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది చంద్రయాన్-2 ఆర్బిటర్. అనుకున్న విధంగా చంద్రుడివైపు ఆర్బిటర్‌ను మళ్లించడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయం సాధించింది. మరికొద్ది రోజుల్లో చంద్రయాన్-2ను జాబిల్లి ఉపరితలంపైకి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలోనే అసలు సవాలు ఎదుర్కోనుంది ఇస్రో. విక్రమ్ మాడ్యూల్‌ను జాబిల్లిపైకి సురక్షితంగా చేర్చి ప్రగ్యాన్ (రోవర్) ద్వారా పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియలో విజయం సాధిస్తే చంద్రుడిపై రోవర్‌ను దించిన రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ చేరుతుంది.
సర్వత్రా ఉత్కంఠ...
భారత్‌కు ఈ ప్రయోగం ఇదే తొలిసారి అయిన కారణంగా సర్వత్రా ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొని ఉందని మంగళవారం చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్ ప్రవేశించిన సందర్భంగా వెల్లడించారు ఇస్రో ఛైర్మన్ శివన్. సురక్షితంగా చంద్రుడిపైకి చేరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని స్పష్టం చేశారు.
విక్రమ్, ప్రగ్యాన్లే కీలకం...
జాబిల్లిపై భారత ప్రథమ ప్రయోగమైన చంద్రయాన్-1ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ప్రస్తుతం చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-2లో ఒక ఆర్బిటర్, సురక్షితంగా దించేందుకు అవసరమైన ల్యాండర్ విక్రమ్, పరిశోధనలకు ఉపయోగించే... రోవర్ ప్రగ్యాన్‌ను జులై 22న జీఎస్ఎల్వీ మార్క్3-ఎం1 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపించారు. ఆగస్టు 14న భూకక్ష్య నుంచి వైదొలగిన ఆర్బిటర్... మంగళవారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
లక్ష్యం...
చంద్రయాన్-1 లక్ష్యాలను విస్తరించడమే కాక... జాబిల్లిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు రెండో ప్రయోగానికి మొగ్గు చూపింది ఇస్రో. చంద్రుడిపై వాతావరణాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో పనిచేయనున్న ఆర్బిటర్‌కు ఏడు పేలోడ్లను వినియోగించనున్నారు. లాండర్ విక్రమ్ మూడు పేలోడ్లతో పనిచేస్తూ శాస్త్ర సాంకేతిక పరిశోధలు చేయడానికి, రోవర్‌ను అనుకున్న లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు ఉపకరించనుంది. జాబిల్లి కక్ష్యపై దిగిన రోజే రోవర్... ఆర్బిటర్ నుంచి వేరుకానుంది.
సెప్టెంబర్ 7న చందమామ దక్షిణ ధృవాన్ని చేరాలని లక్షించింది ఇస్రో. ఆర్బిటర్ ఏడాదిపాటు చంద్రుడిపై పరిశోధనలు చేస్తుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: బ్రిటన్ ప్రధాని బోరిస్‌తో మోదీ ఫోన్ సంభాషణ