ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అనవసరపు ప్రయాణాలు ఎక్కువ. నిత్యం ఇంటి నుంచి కార్యాలయాలకు వెళ్లిరావడమూ ప్రయాసే. అందుకే వీలైనంతవరకు ఇంటి నుంచే పని చేసే విధానాన్ని పాటించడం మేలు. కంప్యూటర్‌పై చేసే పనుల్ని చాలావరకు ఇంటి నుంచే చేయవచ్చు. ఉదాహరణకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, ఆన్‌లైన్ మార్కెటింగ్, విద్య, కన్సల్టెన్సీ రంగాల్లో పనులు ఇళ్ల నుంచే చేయవచ్చు. స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేయాలనే మహాత్మాగాంధీ ఆలోచనల్ని అనుసరిస్తే ఎవరూ ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తలెత్తదు. ఇంటికి చేరువలోనే ఉద్యోగాల్ని కల్పించడం చక్కని విధాన నిర్ణయమవుతుంది. ఇదే తరహాలో- గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాల్ని తగ్గించే దిశగా ఆలోచన చేసేందుకూ ఇదే సరైన అవకాశం. వ్యవసాయ రంగం నుంచి తయారీ, సేవల రంగానికి ప్రజలు తరలి వెళ్లాలనేది ప్రభుత్వ అధికారిక విధానం.
రైతు ఆదాయం పెరిగితేనే..
భారత్ వంటి దేశంలో చాలామందికి ఉపాధి కల్పించే సామర్థ్యం వ్యవసాయ రంగానికే ఉంది. ఈ రంగంలో గౌరవప్రదమైన ఆదాయం దక్కకపోవడమే సమస్య. వ్యవసాయం లాభదాయకంగా ఉండటం లేదనేందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శనం. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేలా ఉంటే చాలామందిని ఆకర్షించవచ్చు. వ్యవసాయ సంబంధ పరిశ్రమలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలి. అలాగైతే, కర్మాగారాల్లో పని చేసేందుకు ప్రజలు నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజలను వ్యవసాయ రంగం నుంచి ఉత్పత్తి, సేవల రంగాలకు మరల్చే నమూనా ఐరోపా, అమెరికాల్లో సైతం విజయవంతం కాలేదు. ఇది భారత్‌లో నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచే అవకాశం ఉంది.
జీవితంలో వేగాన్ని తగ్గిస్తేనే..
సుదూర ప్రయాణాలతోపాటు, స్థానిక రవాణా అవసరాన్ని తగ్గించడం వల్ల శిలాజ ఇంధనాల వినియోగ అవసరాల్ని కుదించవచ్చు. ఫలితంగా కాలుష్య స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. రవాణా అనేది మానవ అవసరమేగానీ, అందులో వేగం ముఖ్యం కాదని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. మన జీవనశైలిలో వేగాన్ని తగ్గిస్తే, మనకు వేగవంతమైన రవాణాతో పని లేదనిపిస్తుంది. ఇందుకోసం ప్రజలు ప్రయాణాల ప్రణాళికల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాలకు చాలామంది దూరంగా ఉంటారు. పర్యావరణ ఉద్యమ బాలిక గ్రెటా థన్‌బెర్గ్ వారిలో ఒకరు. గంగానది పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేస్తూ 2018లో మృతి చెందిన ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఆచార్యులు జీడీ అగర్‌వాల్ రైలులో ఏసీ బోగీలో ప్రయాణం చేసేవారు కాదు.
లాక్‌డౌన్ తర్వాతా ఇలాగ ఉంటేనే...
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు కేవలం కొన్ని గంటలపాటే తెరిచి ఉంటున్నాయి. ఇది మనలో వినియోగ ప్రవర్తనను బలవంతంగానైనా మార్చేస్తుంది. మన మనుగడకు అవసరమైన తప్పనిసరి సరకుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని ఆలోచిస్తాం. మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా మనవద్ద ఉంచుకుంటే అది దొంగతనంతో సమానమని మహాత్ముడు అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దుకాణదారులు సైతం కేవలం లాభాల కోణంలోనే ఆలోచించకుండా, సాధ్యమైనంతగా వీలైనంతమంది వినియోగదారుల అవసరాల్ని తీర్చేందుకు కృషి చేస్తున్నారు. చాలామంది వ్యాపారులు లాభాల సంగతి పక్కనపెట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులకు సాయపడేందుకు సిద్ధపడుతున్నారు. లాభాపేక్ష స్థానంలో ప్రజల కనీస అవసరాల్ని తీర్చాలనే లక్ష్యమే పైచేయి సాధిస్తే, ప్రపంచం మరింత మెరుగైన జీవనయోగ్య ప్రదేశంగా మారుతుంది. మద్యం, పొగాకు వంటివన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉండటం లేదు. లాక్‌డౌన్ తరవాతా వీటి విషయంలో ఇదే పరిస్థితి కొనసాగాలి.
ఆంక్షలు జీవితంలో భాగం కావాలి!
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు, ఎవ్వరూ ఫుట్‌పాత్‌ల మీద తలదాచుకునే పరిస్థితి రాకూడదనే కోణంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఇలాంటి కనీస సౌకర్యాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా వాస్తవం తెలిసొచ్చింది. కరోనా వైరస్ ముప్పు తొలగిన తరవాతా దీన్ని కొనసాగించడం మంచిది. ప్రస్తుతం వివాహాలు, అంతిమ సంస్కారాలను తక్కువ జనం సమక్షంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు భారీగా జనం హాజరు కావడం, పెద్దయెత్తున వ్యయం చేయడం అనవసరం. చాలావరకు మత కేంద్రాల్ని మూసివేశారు. ప్రజలు ఇళ్లవద్ద నుంచే ప్రార్థనలు చేసుకొంటున్నారు. బాబా ఆమ్టే నాగ్‌పుర్ వద్ద నెలకొల్పిన ఆనందవన్‌లో ఇదే నమూనాను అనుసరిస్తారు. ఇకపైనా దీన్ని ఇలాగే కొనసాగించాలి.
పెరిగిన సోదరభావం
ప్రస్తుత సంక్షోభం మనలో అత్యుత్తమ లక్షణాలను వెలికి తీసింది. ప్రజలు తోటివారి మనుగడకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నారు. ప్రజల్లో సోదరభావం పెరిగింది. అందుకనే ప్రభుత్వం పిలుపిచ్చినట్లుగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం తదితర జాగ్రత్తలను సైతం తోసిరాజంటూ ఇతరులకు సాయం చేసేందుకు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో మరణించకూడదనేదే సమాజంలో ప్రాధాన్యాంశంగా మారింది. కరోనా వైరస్ ముప్పు తొలగిన తరవాత సైతం ఇలాంటి సమానత్వ భావన, సౌహార్దస్ఫూర్తి మన సమాజంలో నాటుకుపోయిన కుల, మత, వర్గ విభేదాల్ని అధిగమిస్తాయని ఆశిద్దాం.
వెల్లివిరుస్తున్న ఔదార్యం
డబ్బులే సర్వస్వం కాదు అనే విషయంలో నెమ్మదిగా అందరికీ వాస్తవికత బోధపడుతోంది. మీ దగ్గర డబ్బులు ఉన్నా, మీకు కావాల్సినవి కొనుక్కోలేకపోతున్నప్పుడు వాటితో ఉపయోగం ఏమిటి? ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పెద్ద నగరాలకు వెళ్లిన తమ ఆత్మీయులను ఇంటికి వచ్చేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుత సమయంలో వారు తెచ్చే డబ్బులకంటే, అంతా కలిసి ఉండటమే ముఖ్యమని నమ్ముతున్నారు. వలస కూలీలు వందల సంఖ్యలో రహదారులపై తమ సొంత ప్రాంతాలకు నడుస్తూ కనిపిస్తుండటానికి ఇదే కారణం.
జైళ్లలో ఖైదీల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే..
ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇంతకుముందెప్పుడూ ప్రజలు పోలీసుల్లో మానవతా కోణాన్ని చూడలేదు. లాఠీలు విదిలించడం, నేరగాళ్లను ఎదురు కాల్పుల్లో చంపడం వంటి చర్యలకు బదులుగా వారిప్పుడు నిరాశ్రయులకు, రహదారుల వెంట సొంతూళ్లకు నడిచి వెళ్తున్న వారికి భోజనం పెడుతున్నారు. వారిలో కనిపిస్తున్న ఈ మార్పు స్వాగతించదగింది. ఇదే క్రమంలో జైళ్లపై భారాన్నీ తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. జైళ్లలో ఎంత తక్కువ మంది ఉంటే, సమాజం అంత బాగున్నట్లు. అసలు జైళ్లనేవే లేకపోవడం ఆదర్శనీయం. సంస్కరణ కేంద్రాలుంటే చాలు. ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ వేళలో ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు రంగానికి వదిలేయడం సమంజసం కాదు. ప్రభుత్వ కళాశాలలు, బడుల భవనాల్ని ప్రజలకు ఆవాసం కల్పించేందుకు ఉపయోగించాలి. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. పరీక్షలకు బదులు అభ్యసనకే ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మూల్యాంకనం గుణాత్మకంగా ఉండాలి.
- సందీప్ పాండే, రచయిత - రామన్ మెగసెసే పురస్కార గ్రహీత
ఇదీ చదవండి: 40 రోజుల్లో అక్కడ 6 ఏనుగులు మృతి- ఏమైంది?