లాక్డౌన్ సమయంలోనూ బీఎస్-4 వాహనాల అమ్మకాలు జరగడంపై మండిపడింది సుప్రీంకోర్టు. వాటి రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి.. అమ్మకాలు చేశారని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. మార్చిలోనే ఈ వాహనాల అమ్మకాలపై కోర్టు నిషేధం విధించినా.. ఆ నెల 31 తర్వాత అమ్మకాలు కొనసాగించడాన్ని సుప్రీం తప్పుపట్టింది.
ధర్మాసనం సీరియస్...
వాహన డీలర్ల వద్ద ఉన్న బీఎస్-4 వాహనాలకు లాక్డౌన్ ఎత్తివేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని మార్చి 27న ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్శాసనం.. తదుపరి ఆదేశాల వరకు బీఎస్-4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. మార్చి 31 తర్వాత ఈ రకం వాహనాలను అమ్మడంపై డీలర్స్ అసోసియేషన్‌పై మండిపడింది ధర్శాసనం. కోర్టు ఆదేశాలను దిక్కరించిన వారికి తగిన శిక్ష వేస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.
వేరే దేశాల్లో అయినా..
వేరే దేశాలకు బీఎస్-4 వాహనాలను ఎగుమతి చేసి, అక్కడ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని డీలర్ల సంఘం కోరికపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. కొన్ని దేశాలు ఇప్పటికీ బీఎస్-4 విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టలేదని డీలర్లు పేర్కొనగా.. తాము ఎందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. అమ్మకాల విషయంలో విధించిన తుది గడువు తయారీదారులకు తెలిసినా ఎందుకు మరింత ఉత్పత్తి చేశారని ప్రశ్నించింది.
ఇప్పటికే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 చమురు వినియోగాన్ని యథావిధిగా అమలు చేస్తోంది కేంద్రం.