దేశం కరోనా వైరస్‌తో పోరాడుతున్న వేళ మామిడి పండ్ల కాలం వచ్చేసింది. మామిడిలో ప్రసిద్ధి గాంచిన దుషహరి పండ్లతో సహా ఆయా రకాలు మార్కెట్లోకి అడుగుపెట్టి నోరూరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మామిడి రకాల అభివృద్ధికి విశేష కృషి చేసి మ్యాంగో మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన ఓ వ్యక్తి చరిత్ర తెలుసుకోవాల్సిందే..
మామిడి మనిషిగా ప్రసిద్ధి గాంచారు ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన హాజీ కలీముల్లా ఖాన్. సాధారణంగా అయితే ఒక చెట్టుకి ఒకే రకమైన మామిడి పండుతుంది. అంటుకట్టే విధానంలో రెండు, మూడు రకాల పండ్లు పండించేందుకు అవకాశం ఉంది. అయితే ఒకే చెట్టుకు ఏకంగా మూడు వందల రకాల పండ్లంటే ఆశ్చర్యమే కదూ.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కలీమూల్లా. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
"మీరు ఈ 300రకాల పండ్లు పండే చెట్టును నెల తర్వాత వచ్చి చూస్తే.. దానిపై మరో 100 రకాల పండ్లు ఉంటాయి. ఇది ఏ రకమైన చెట్టని ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. ఇది ఓ చెట్టు మాత్రమే కాదు ప్రపంచంలోని మామిడి రకాలకు నిధి. ఎందుకంటే ఒకే చెట్టుపై అన్ని రకాల పండ్లు కనిపిస్తాయి."
-హాజీ కలీముల్లా, పద్మశ్రీ అవార్డు గ్రహీత
మామిడికి ప్రముఖుల పేర్లు..
తాను అభివృద్ధి చేసిన మామిడి పండ్లకు ప్రముఖుల పేర్లను పెడుతుంటారు కలీముల్లా. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా, అఖిలేశ్ యాదవ్, ఐశ్వర్య రాయ్, సచిన్ తెందుల్కర్ అంటూ పండ్ల రకాలను ప్రేమగా పిలుస్తారు.
ఏడో తరగతి ఫెయిల్..
తాను ఎక్కువగా చదువుకోలేదని చెప్తారు కలిముల్లా. ఏడో తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత చదువుపై ఆసక్తి పోయిందని చెప్పారు. చదువు ఆగిపోయిన అనంతరం తరాలుగా చేస్తున్న తోటల పెంపకంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మామిడి సాగులో అభిరుచి పెరిగిందని చెప్పుకొచ్చారు.
చెట్టు చావుతో..
నాడు ఏడు విభిన్న రకాలను కలిపి ఓ చెట్టును తయారు చేశానని.. కానీ 1960లో భారీ వర్షాలకు అది చనిపోయిందని చెప్పారు కలిముల్లా. అయితే ఒకే చెట్టుకు పలు రకాల పండ్లను పండించే తన కల అలాగే ఉండిపోయినట్లు వెల్లడించారు. తోటల పెంపకంపై చాలా శ్రమించినట్లు చెప్పిన కలీముల్లా.. నాటి కష్టానికి గుర్తుగా చేతులపై బొబ్బలు ఇంకా ఉన్నాయని చూపించారు. పనిపై ఉన్న శ్రద్ధ వల్లే మామిడి అభివృద్ధిలో రాణించినట్లు చెప్పారు. 1987లో ఒకే చెట్టుపై వివిధ రకాలను పండించడం తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు కలీముల్లా. ప్రస్తుతం 300 వందల రకాల పండ్లను ఆ చెట్టు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతరించిన మామిడి రకాలు..
1919లో 1300 రకాల మామిడి పండ్లు ఉత్పత్తి అయ్యేవని గుర్తు చేశారు కలీం. కాలం గడుస్తున్నా కొద్ది ఆయా రకాలు అంతరించిపోయినట్లు వెల్లడించారు. నాటి రెహమాన్ ఖేరా సర్కారు సంకల్పించుకోకపోతే ప్రస్తుతం ఉన్న పండ్ల రకాలు కూడా ఉనికిలో లేకుండా పోయేవని చెప్పారు.
ఇదీ చూడండి: వేడి వాతావరణంలో సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా