బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చిన తేజస్వి.. సభా వేదికపై కూర్చోగా ఆయనకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెనక్కి వెళ్లిపోగా.. మరో చెప్పు మాత్రం ఆయన చేతులకు తగిలింది. ఈ దృశ్యం వీడియోలో రికార్డయింది.
ప్రస్తావించని తేజస్వీ..
అయితే, ఆయనపైకి ఎవరు, ఎందుకు విసిరారో తెలియలేదు. ఈ ఘటన అనంతరం ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వి ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తేజస్విపై చెప్పులు విసిరిన ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఖండించారు. ఎన్నికల బహిరంగ సభల సందర్భంలో నేతలకు సరైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆర్జేడీ తలపడుతోంది. మొత్తం 243 స్థానాలకు గాను ఆర్జేడీ 144 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించుతోంది.
ఇదీ చూడండి: చిరాగ్ పాసవాన్ను పరామర్శించిన బిహార్ సీఎం నితీశ్