ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో పోలీసులపై కాల్పులు జరిపి 8 మందిని హత్యచేసిన నిందితుల్లో ఒకరైన ఉమాకాంత్ ప్రాణభయంతో పోలీసులకు లొంగిపోయాడు. మెడలో నన్ను క్షమించండి అనే ప్లకార్డు ధరించి కుటుంబంతో కలిసి వెళ్లి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన ఉమాకాంత్ అలియాస్ గుడ్డన్ కుటుంబసభ్యుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నట్లు నన్ను క్షమించండి అని మెడలో ప్లకార్డు ధరించి లొంగిపోయాడు. తన ప్రాణాలను రక్షించాలని కోరాడు. అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఎన్కౌంటర్లు
జులై 3వ తేదీన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు వెళ్లగా అతడి అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 8 మంది పోలీసులు మృతిచెందారు. అప్పటినుంచి ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం, కాన్పూర్ పోలీసులు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు.
వికాస్ దూబేతోపాటు అతడి అనుచరులు అమర్ దూబే, అతుల్ దూబే, ప్రేమ్ కుమార్, ప్రభాత్ మిశ్రాను వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దయాశంకర్, శ్వామ్ బాజ్‌పాయ్, జహన్ యాదవ్, శశికాంత్, మోను, శివమ్ దూబేలను అరెస్టు చేశారు. గోపి సైని అనే మరో నిందితుడు పదిరోజుల క్రితం లొంగిపోయాడు.
ప్రాణభయంతో
ఉమాకాంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు. అయితే పోలీసులను హత్య చేసిన అనంతరం పశ్చాతాపానికి గురైనట్లు, అందుకే పోలీసులకు లొంగిపోయినట్లు ఉమాకాంత్ తెలిపాడు. వరుస దాడుల కారణంగా భయపడ్డ అతను ప్రాణ భయంతో లొంగిపోయినట్లు కాన్పూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.