దేశంలో కరోనా కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ముంబయి కొలాబాలోని ప్రఖ్యాత తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్‌కు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బందికి వైరస్ సోకటం వాస్తవమేనని తెలిపిన తాజ్ హోటల్ నిర్వాహకులైన ఇండియన్ హోటల్స్ కంపెనీ.. వారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.
" మా సిబ్బందికి వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాం. వారితో చనువుగా ఉన్న మిగిలిన వారిని కూడానిర్బంధ కేంద్రాలకు పంపించాం. మా హోటల్లో ప్రస్తుతం అతిథులెవరూ లేరు. కేవలం హోటల్ నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
- ఇండియన్ హోటల్స్ కంపెనీ ప్రకటన
'కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు తాజ్ ఉద్యోగులు ముంబయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది' అని ముంబయి ఆసుపత్రికి చెందిన డాక్టర్ గౌతమ్ బన్సాలీ తెలిపారు.