ముంబయి మలాడ్‌లో గోడ కూలిన ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో 90 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. అయితే.. ఈ విషాద ఘటనలో ఓ చిన్నారి మృత్యుంజయుడయ్యాడు. త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న వారి ఇంటి పై గోడ కూలిపోయింది. నివాసంపై ఓ పక్కన గోడ శిథిలాలు, మరోపక్కన నీరు చేరింది. ఆయుష్, అతడి తల్లిదండ్రులు, కొంతమంది పొరుగువాళ్లు నీటిలో కొట్టుకుపోయారు. మరికొంతమంది గోడ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాకుండా ఇంటికి అరకిలోమీటరు దూరంలో పడిఉన్నాడు ఆ పసి బాలుడు.
కానీ ఆయుష్ తాత, నానమ్మలు శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో ఆయుష్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. కానీ వారికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
"మా కుమారుడు ఆయుష్‌తో కలసి ఇంట్లో నిద్రిస్తున్నాం. మాకేం జరుగుతుందో తెలిసే లోపే నీళ్లలో కొట్టుకుపోతున్నాం. భార్యభర్తలం పిల్లాడిని పట్టుకుని ఒకే వైపు వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ నీటి వరద కారణంగా విడిపోయాం. మా నివాసానికి అర కిలోమీటరు దూరంలో ఆయుష్ ప్రాణాలతో కనిపించాడు. నా భార్య కూడా బతికే ఉంది."
-ఆయుష్ తండ్రి