జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యంత పాశవిక అత్యాచారం, హత్య ఘటనపై ఏడాది తర్వాత తీర్పు వెలువడింది. పఠాన్‌కోట్‌లోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది.
కోర్టు దోషులుగా నిర్థరించిన వారిలో గ్రామపెద్ద సంజిరామ్, ఆయన స్నేహితుడు ఆనంద్‌దత్తా, ఎస్.ఐ ఆనంద్, హెడ్‌కానిస్టేబుల్ తిలక్‌రాజ్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్, సురేంద్రవర్మ ఉన్నారు. అయితే సంజి రామ్‌కుమారుడు విశాల్‌ను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.
ఈ కేసుకు సంబంధించి జూన్ మొదటి వారంలో విచారణ పూర్తవగా ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఏం జరిగింది..?
గతేడాది జనవరి పదో తేదీన కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించిన దుండగులు ఒక ఆలయంలో ఆ చిన్నారిని బంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
- ఇదీ చూడండి: మమతది కిమ్‌జోంగ్ వ్యక్తిత్వం: గిరిరాజ్