ముంబయిలో గ్యాస్ లీక్ అయిందంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయిందని పలు ప్రాంతాల నుంచి ఫోన్లు రావడం వల్ల అధికారులు ఉలిక్కిపడ్డారు. చెంబూర్, ఘాట్‌కోపర్, కంజుర్‌మార్గ్, విఖ్రోలి, పోవై ప్రాంతాల నుంచి గ్యాస్ లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని... బృహత్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. అగ్నిమాపక దళాలను ఘటనా స్థలాలకు పంపించామని.. సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇప్పటివరకూ గ్యాస్ లీక్ అయినట్లు నిర్ధరణ కాలేదని ముంబయి అగ్నిమాపక దళం స్పష్టం చేసింది. ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, పుకార్లను వ్యాపింపజేయవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే 17 ఫైర్ ఇంజన్లను ఆయా ప్రాంతాలకు పంపామని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు.