బంగాల్లో ఎన్నికల వేళ రాష్ట్ర పరిస్థితులపై ఈసీ ప్రత్యేక పరిశీలకుడు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. బంగాల్లో అంతర్గతంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీ పరిశీలకుడు అజయ్ నాయక్ పేర్కొన్నారు.
" 15 ఏళ్ల క్రితం నాటి బిహార్ పరిస్థితులు బంగాల్లో కనిపిస్తున్నాయి. ఆ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో గట్టి పహారా ఉండేది. ఇప్పుడది బంగాల్లోనూ ప్రవేశపెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర పోలీసులపై ఇక్కడి ప్రజలకు నమ్మకం పోయింది."
-అజయ్ నాయక్, బంగాల్లో ఈసీ ప్రత్యేక పరిశీలకుడు
అజయ్ ఆరోపణలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాన కార్యదర్శి సుబ్రతా బక్షి డిమాండ్ చేశారు.
బంగాల్లో మొదటి దశ పోలింగ్లో ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసమయ్యాయి. రెండో దశలోనూ డార్జిలింగ్ పరిధిలోని చోప్రా, రాయ్గంజ్లోని ఇస్లాంపుర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అజయ్ నాయక్ గతంలో బిహార్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా పని చేశారు.
ఇదీ చూడండి: 'దీదీ... తేల్చాల్సింది కుంభకోణం లెక్కలు'