ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాలు ప్రశంసలు కురిపించాయి. ఓ మహిళా ఆర్థిక మంత్రి విశ్వాసం నింపే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ అన్నారు. 25 శాతం ఉన్న కార్పొరేట్ పన్ను పరిధిని విస్తరించడం పెట్టుబడుల చక్రానికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
" విశ్వాసాన్ని నింపే బడ్జెట్‌ను ఓ మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టినందుకు ఒక మహిళా వ్యాపారవేత్తగా నాకు ఎంతో గర్వంగా ఉంది."
-కిరణ్ మజుందార్ షా ట్వీట్.
ఆర్థిక మంత్రి తాత్కాలిక చర్యలపై కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పేర్కొన్నారు.
2025 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్ధగా తీర్చిదిద్దేందుకు నిర్మలా సీతారామన్ తగిన చర్యలు చేపట్టారని భారత పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ ప్రశంసించారు.
బడ్జెట్‌ను 'ప్రగతిశీల బడ్జెట్'గా అభివర్ణించారు వేదాంత రీసొర్సెస్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్. ఆరోగ్యం, పరిశుభ్రత, నీరు, సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారన్నారు.
అసోచామ్ అధ్యక్షుడు బీకే గోయెంకా ఇది మార్పు దిశగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు.
బడ్జెట్లో గ్రామీణ, పట్టణాభివృద్ధికి సమతూకంగా ప్రాధాన్యమిచ్చారని అభిప్రాయపడ్డారు దాల్మియా భారత్ గ్రూప్ సంస్థల ఎండీ పునీత్ దాల్మియా.
ఇదీ చూడండి: 'వ్యవస్థీకృత సంస్కరణలే ఎజెండాగా బడ్జెట్'