1986లో భారత్ చైనా లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్, భారత ఆర్మీ మధ్య కంటికి కన్ను అన్నట్లుగా ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1988లో బీజింగ్ పర్యటనకు వెళ్లారు. 34 సంవత్సరాల తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన తొలి భారతీయ ప్రధాని ఆయన..!
ఆ పర్యటనలో భాగంగా అప్పటి చైనా ప్రధానమంత్రి లీ పెంగ్‌తో రాజీవ్ గాంధీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలను శాంతియుతంగా, స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి నేతలిద్దరు అంగీకరించారు. చర్చల తర్వాత చైనా విడుదల చేసిన ప్రకటనలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేసుకోనున్నట్లు నిర్ణయించారు. సరిహద్దు విషయంలో సహేతుకమైన పరిష్కారం లభించేలా ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని నేతలు ఒప్పందం చేసుకున్నారు.
'సమ్డోరాంగ్ చూ' ప్రాంతంలో పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టినప్పటికీ.... భారత్-చైనాల మధ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కించడంలో రాజీవ్ చారిత్రక పర్యటన విజయవంతమైంది. చైనా, భూటాన్, భారత్... ఈ మూడు దేశాల సరిహద్దులలో సమ్డోరాంగ్ చూ ప్రాంతం ఉంది. 2017 లో ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తిన డోక్లాం ప్రాంతానికి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది. డోక్లాంలో 73 రోజుల పాటు సాగిన ప్రతిష్టంభన చివరకు ఇరుదేశాల నేతల మొట్టమొదటి అనధికార భేటీకి దారితీసింది. ఫలితంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య వుహాన్‌లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి గతేడాది ఈ అనధికార సమావేశం జరిగింది.
సంబంధాలు కాపాడుకోవాలి
ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాల నడుమ నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ల రెండో అనధికార భేటీకి చారిత్రక నగరమైన మహాబలిపురం వేదికైంది. చైనా, భారత్‌ల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలలో వాణిజ్య లోటు, కశ్మీర్ సమస్య, పాకిస్థాన్‌తో సంబంధాల వంటివి ప్రధానంగా ఉన్నాయి. అయితే వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించే వరకు ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత దిగజారకుండా కాపాడుకోవడమే అసలైన సవాలు. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడం సులభమైన విషయం కానప్పటికీ... వుహాన్ శిఖరాగ్ర సమావేశ ఫలితాలను బట్టి ఇది అంత క్లిష్టతరమైన విషయం కాదని స్పష్టమవుతోంది. ఇరుదేశాల మధ్య ప్రశాంతత నెలకొల్పి, సరిహద్దుల్లో సైనికుల మధ్య శాంతి నెలకొల్పటాన్ని ఈ సమావేశం నొక్కి వక్కాణించింది. 2005లో కుదిరిన ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో సైన్యం దూకుడు ప్రదర్శించకూడదని ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి. సరిహద్దుల్లో అవాంఛనీయ సంఘటనలు తగ్గుముఖం పట్టడం ఈ సమావేశం తర్వాత వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనది. పరస్పరం విశ్వాసం పాదుకొల్పేదిశలో ఈ సమావేశం ఓ ముందడుగు అవుతుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇరుదేశాల మధ్య సద్దుమణగని, ఇప్పటికిప్పుడు పరిష్కారం కాని సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ.. వాటిని మరింత జఠిలం కాకుండా చూడాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అనధికార భేటీ విజయంపై భారీగా ఆశలే ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం వేరుగానే ఉంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370 రద్దుపై చైనా గుర్రుగానే ఉంది. అంతేగాక తన మిత్రదేశమైన పాకిస్థాన్‌కు చైనా వంత పాడుతోంది. భారత అంతర్గత విషయాలు ఇతర దేశాలకు సంబంధం లేదని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా... చైనా అధీనంలో ఉన్న ఆక్సాయిచిన్ గురించి పదేపదే ప్రశ్నలు లేవనేత్తుతోంది. దీనికి భారత్ కూడా దీటుగానే బుదులిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా, పాక్‌లు సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. చైనా-పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సంయుక్త సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించింది. భారత్ ఎంతగా చెబుతున్నా సరే కశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇటీవలే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు కశ్మీర్ దశాబ్దాలుగా ఉన్న పెద్ద వివాదంగా చైనా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం ఇరుదేశాలు సానుకూలంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది. దీనికి బదులుగా హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను చైనా అంతర్గత వ్యవహారమని పాక్ బదులిచ్చి చైనాకు వంత పాడింది.
భారత్‌కు వ్యతిరేకమే
భారత్‌తో సఖ్యతతో వ్యవహరించడం చైనాకు అవసరం లేదని విదేశీ వ్యవహారాల నిపుణుడు రాజామోహన్ ఓ పత్రిక వ్యాసంలో స్పష్టం చేశారు. 'భారత్‌తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది. రక్షణ బడ్జెట్ దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అన్ని రంగాల్లో భారత్‌తో పోలిస్తే చైనా ఎంతో ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు అనుకూలంగా వ్యవహరించే అవసరం చైనాకు లేదు. అంతేగాక భారత్‌కు వ్యతిరేకంగా ఉండటానికే ప్రయత్నిస్తోంది. అణు సరఫరా గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వ హోదా దక్కడానికి మోకాలు అడ్డడం సహా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందు ఉంచకుండా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. వుహాన్ భేటీ తర్వాత కూడా ఈ రకమైన చైనా ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. ఇది చెన్నై సమావేశం తర్వాత కూడా మారదు.' అని రాజామోహన్ రాసుకొచ్చారు. భారత్ చైనాల మధ్య వాణిజ్య లోటు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నా... ఇది ఇరుదేశాల మధ్య పోటీ, సహకారాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది.
గత పాలకుల బీరాలు
అయితే చైనా గత పాలకులందరూ కూడా ద్వైపాక్షిక సంబంధాలపై బీరాలు పలికినవారే. 'గతంలో జరిగిన సంఘటనలను తల్చుకుంటూ ఉండటం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం ఉత్తమం'... మవో తర్వాత చైనా రిపబ్లిక్ చైర్మన్‌గా ఉన్న డెంగ్ గ్జియావోపింగ్ భారత ప్రధాని రాజీవ్ గాంధీతో అన్న మాటలు. భారత్ అంతర్గత సమస్యల్లో తలదూర్చమని 1991లో దిల్లీ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని పెంగ్ అప్పటి ప్రధాని పీవీ నరసింహరావ్కు హామీ ఇచ్చారు. పాక్‌తో ఉన్న సమస్యలను ఇరుదేశాలు కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ నీటిలో రాతలుగానే మిగిలిపోయాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న అమెరికాను అదుపుచేయడానికి పాక్‌తో బంధాన్ని మరింత బలపరుచుకుంటోంది చైనా.
శాంతిస్థాపనకు కృషి అనివార్యం
వుహాన్ సమావేశ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని మోదీ, జిన్‌పింగ్‌లు ముందుకెళ్లడమే ఇప్పుడున్న ఉత్తమ మార్గం. అపార్థాలతో మరిన్ని సమస్యలను సృష్టించుకోకుండా శాంతిని నెలకొల్పడానికి ఇరువురు నేతలు కృషి చేయాలి. నియంత్రణ రేఖ వద్ద ఇరువురు సంయమనం పాటించడమే కాకుండా సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనడం ఈ భేటీలో చాలా అనివార్యం.
ఇదీ చూడండి: షోర్ ఆలయాన్ని దర్శించుకున్న మోదీ-జిన్‌పింగ్