హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో విపరీతంగా మంచు కురుస్తోంది. ఓ వైపు వాతావరణశాఖ హెచ్చరించినప్పటికీ సిమ్లా సోయగాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యటకులు వస్తున్నారు. గజగజ వణికే చలిలోను ఐస్‌క్రీం తింటూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆనందానికి హద్దులు లేవంటున్నారు. సిమ్లాని భూలోక స్వర్గంగా అభివర్ణిస్తున్నారు.
"ఈ మంచు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఈ సిమ్లా నగరం దేవుడిచ్చిన వరం. ఆయన ఆశీస్సులతోనే ఇలా ఉంది.నిన్నటి నుంచి హిమపాతం తాకిడి ఎక్కువైంది."
-పర్యటకురాలు.
స్తంభించిన జనజీవనం
ఓ వైపు విపరీతంగా కురుస్తోన్న మంచుతో ప్రకృతి ప్రేమికులు నూతన ఉత్సాహంలో మునిగితేలుతుంటే.. మరోవైపు సిమ్లాలో జనజీవనం స్తంభించింది. రహదారులపై మంచు పేరుకుపోవడం వల్ల కొన్ని చోట్ల వాహనాలు మంచులో ఇరుక్కుపోయి కదల్లేని పరిస్థితి ఏర్పడింది. తేలికపాటి హిమపాతం వల్ల వాహనాలు రోడ్లపై జారుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి.
జేసీబీలతో మంచును తొలగిస్తూ..
రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. జేసీబీలతో మంచును తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఫలితం దక్కడం లేదు.
ఇదీ చూడండి : హిమంతో ధవళ వర్ణ శోభితమైన చైనా ఈశాన్య రాష్ట్రాలు