హిమాలయ రాష్ట్రం సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్ తమాంగా అలియాస్ పీఎస్ గోలే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని గాంగ్టక్లో ఉన్న పాల్జోర్ స్టేడియంలో కార్యక్రమం జరిగింది. గవర్నర్ గంగా ప్రసాద్ ముఖ్యమంత్రిగా గోలేతో పదవీ ప్రమాణం చేయించారు. నేపాలీ భాషలో తన ప్రమాణాన్ని పూర్తి చేశారు నూతన సీఎం.
వందలాది మంది మద్దతుదారుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు గోలే. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత పవన్ చామ్లింగ్ హాజరుకాలేదు.
సిక్కిం క్రాంతికారి మోర్చాను 2013లో ఏర్పాటు చేశారు పీఎస్ గోలే. తాజాగా లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. 32 సీట్లున్న అసెంబ్లీలో 17-15 తేడాతో పవన్ చామ్లింగ్ పార్టీని ఓడించారు. 24 ఏళ్ల నుంచి సీఎంగా ఉంటూ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన పవన్ చామ్లింగ్‌ను ఓటమి పాలు చేశారు.
ప్రచారాన్ని అంతా తానై నడిపించడం కారణంగా గోలే శాసనసభకు పోటీచేయలేదు. ఈ నేపథ్యంలో రాగల ఆర్నెళ్లలో సిక్కింలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ