దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కర్తార్‌పూర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ సమాచార ప్రసార శాఖ విడుదల చేసిన ఓ వీడియోలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతల చిత్రాలకు స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే, షాబేగ్ సింగ్, అమ్రిక్ సింగ్ ఖల్సాకు చెందిన చిత్రాలు వీడియోలో కనిపించాయి. వీరంతా 1984లో భారత్ సైన్యం స్వర్ణదేవాలయంలో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించారు. వేర్పాటువాదుల అజెండాగా పిలిచే 2020 రిఫరెండానికి వీడియోలో చోటు కల్పించింది పాక్.
పాక్‌లోని సిక్కు ప్రజల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. కీలక వీడియోలో ఖలిస్థాన్ నేతల పోస్టర్లు కనిపించేలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సిక్కులు పాక్‌లోని పలు గురుద్వారాలను దర్శించుకున్నట్లు ఉన్న సన్నివేశాలతో వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోలో పంజాబ్ మాజీమంత్రి, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌లకూ స్థానం కల్పించారు.
భారత్ అభ్యంతరం..
ఖలిస్థానీ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రేన్వాలేకు కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవ వీడియోలో స్థానం కల్పించడంపై దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
కర్తార్‌పుర్ నడవా నిర్మాణంపై చర్చల సమయంలోనూ.. పాక్ తరఫు నుంచి ఖలిస్థానీ వేర్పాటువాద నేతకు స్థానం కల్పించడంపై తీవ్రంగా ఆక్షేపించింది భారత్.
ఇదీ చూడండి: ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో?