కొవిడ్-19 టీకా తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక్కో టీకా డోసు ధరను రూ.250గా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో టీకా సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఓ మీడియా సంస్థ మంగళవారం నివేదించింది. కరోనా వైరస్ కట్టడికి కొద్ది వారాల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ సీరం, ఫైజర్, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తులు చేసుకున్నాయి. దీనిపై రెండు వారాల్లో నియంత్రణ సంస్థ సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వాటి ధరల గురించి వార్తలు వస్తున్నాయి. అలాగే సీరమ్ సంస్థ భారీగా టీకాలు సరఫరా చేస్తుందని కేంద్రం భావిస్తోంది.
ఇదిలా ఉండగా..భారత్‌లోని ప్రైవేటు మార్కెట్‌లో ఒక్కో డోసు రూ.1,000గా ఉండొచ్చని, భారీ సరఫరా ఒప్పందాలపై సంతకాలు చేసిన ప్రభుత్వాలకు ఇది తక్కువ ధరకే లభించవచ్చని సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ఇటీవల వెల్లడించారు. తమ సంస్థ మొదట భారత్‌లో సరఫరాపై దృష్టి పెడుతుందని, తరవాతే ఇతర దేశాలకు పంపిణీ చేస్తుందని ఆయన అన్నారు.