మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే ఉగ్రవాదం.. సరిహద్దులను దాటి దక్షిణ భారతానికి పాకింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 నుంచి 200 మంది ఉగ్రవాదులతో ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్నే ఐసిస్ ఏర్పాటు చేసింది. ఇందుకేసం కేరళ, కర్ణాటకలను ఐసిస్ ఉగ్రవాదులు ఎంచుకున్నారని.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ఐరాస నివేదిక హెచ్చరించింది. ఇందులోని సభ్యులంతా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందినవారేనని తెలుస్తోంది. ఈ కొత్త బృందం భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్ఫష్టం చేసింది.
అనలిటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ (ఏఎస్ఎస్ఎమ్టీ) 26వ నివేదికలో.. ఐసిస్, అల్‌ఖైదా, వాటి కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి వెల్లడించింది ఐరాస. అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్, కాందహార్, నిమ్రుజ్ రాష్ట్రాల్లోని తాలిబన్ వర్గాల అధీనంలో.. భారత ఉపఖండంలోని అల్‌ఖైదా(ఏక్యూఐఎస్) పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏక్యూఐస్ లీడర్ ఆసీం ఉమర్ చనిపోయాక ఆ బాధ్యతలను చేపట్టిన ఒసామా మహమ్మూద్... ఆసీం మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.
గతేడాది మే 10న ఇస్లామిక్ స్టేట్ చేసిన ఓ ప్రకటనను ఈ నివేదికలో ప్రస్తావించింది ఐకరాజ్యసమితి. ఇందులో 'హింద్ విలయహ్'(ఇండియా ప్రావిన్స్) పేరిట 180 నుంచి 200 మందితో భారతలో కొత్త గ్రూప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని గుర్తు చేసింది. ఇందులోని సభ్యులంతా కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఐఎస్ఐఎల్ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఐసిస్ చెప్పినట్లు తెలిపింది.
కశ్మీర్లో ఐసిస్ దాడులకు ఖోరాసన్ ప్రావిన్స్ బ్రాంచ్ ఆధ్వర్యం వహిస్తున్నట్లు ఇప్పటికే భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 2015లో ఏర్పాటైన ఈ విభాగం.. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సహా సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలకు కారణమవుతోంది. దక్షిణ భారత్‌లోని కొత్త ప్రావిన్స్ ఏర్పాటుతో భారత్ మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు.