కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. ఏడాది పాటే యడ్డీ ప్రభుత్వం మనుగడ సాగించగలదని వ్యాఖ్యానించారు.
కర్ణాటక శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు సన్నద్ధత ప్రారంభించాలని వ్యాఖ్యానించారు సిద్ధరామయ్య.
"ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. పార్టీని బలోపేతం చేయాలి. యడియూరప్ప ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందని ఎవరికీ నమ్మకం లేదు."
-సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారు ఎంతకాలం ప్రభుత్వాన్ని నడపగలరని వ్యాఖ్యానించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భాజపా.. ప్రజల మద్దతుతో అధికారంలోకి రాలేదని, అనైతికంగా శాసనసభ్యులను కొని అధికారంలోకి వచ్చిన వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
సంకీర్ణ కూటమి సర్కారు పడిపోవడానికి కారణం తానేనని జేడీఎస్ నేతలు వ్యాఖ్యానించడం రాజకీయంగా లబ్ధి పొందేందుకేనని తెలిపారు సిద్ధరామయ్య. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం మీరేనంటూ... సిద్ధరామయ్య, దేవేగౌడ పరస్పరం ఆరోపణలు సంధించుకుంటున్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్... జాబిల్లి ఛాయాచిత్రాలు పంపేన్