తీవ్రవాదుల కర్కశత్వం జమ్ముకశ్మీర్ ప్రజలను నిత్యం పీడిస్తూనే ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియదు. ఎందుకు చంపుతారో తెలియదు. అయితే, ఉగ్రవాదుల అకృత్యాలు ఈసారి దక్షిణ కశ్మీర్ షోపియాన్లో ఓ ఏడేళ్ల మెహ్రూన్ నిస్సా, తన తల్లిని, చిన్నారి చెల్లిని శోకసంద్రంలో ముంచేశాయి. ఎన్కౌంటర్లో ఇల్లు కోల్పోయానని ఈటీవీ భారత్కు చెప్పుకున్న నిస్సా తండ్రి.. ఆ తర్వాత కొద్ది గంటలకే శవమై ఈటీవీ భారత్ కెమెరాకు కనిపించాడు.
నిస్సా ఇంటిలో నక్కారు....
కల్మషమెరుగని మెహ్రూన్ నిస్సా ఊరు షోపియాన్లోని పింజూరా. సెలవుల కారణంగా నిస్సా కుటుంబమంతా కొద్ది రోజులుగా అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటున్నారు. అదే సమయంలో.. హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ ఉమర్ ధోభి, నలుగురు సహచరులతో కలిసి పోలీసుల కళ్లుగప్పి నిస్సా ఇంట్లోకి చొరబడ్డాడు. సమాచారమందుకున్న జమ్ము కశ్మీర్ పోలీసులు, భారత సైనికులు జూన్ 8న ఆ ఇంటిని చుట్టు ముట్టారు. తుపాకులు ఎక్కుపెట్టారు. ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. దీంతో మోటార్ షెల్లు ప్రయోగించి తీవ్రవాదులను హతమార్చారు పోలీసులు.
నిస్సా గూడు చెదిరింది..
ఈ పోరులో నిస్సా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న నిస్సా కుటుంబం తెల్లారి ఇంటికి చేరుకుంది. నిన్నటి వరకు తాను ఆడుకున్న ఇల్లు.. రాళ్లు రప్పాల్లా మారడాన్ని చూసి బోరున విలపించింది. తండ్రి తారీఖ్ మహ్మద్ పాల్ వేలు పట్టుకుని ఆ ప్రాంతమంతా తిరిగి చూసింది. చేతిలో నాన్న ఫోన్ పట్టుకుని ఉప్పొంగుతున్న ఆ దుఃఖాన్ని దిగమింగింది. ఏదేమైనా నాన్న ఉన్నాడని ధైర్యంగానే ఉంది.
పసి కళ్ల నిండా కన్నీళ్లు..
ఆ సమయంలోనే ఈటీవీ భారత్తో మాట్లాడాడు తారీఖ్. 12 ఏళ్లు నెత్తుటిని చెమటగా చేసి నిర్మించిన ఇల్లు ఇలా కుప్పకూలిందని ఆవేదన చెందాడు.
మూడు గంటల తర్వాత ఆయుధాలతో ఓ వ్యక్తి వచ్చి తారీఖ్ను అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ తెల్లారి తారీఖ్ శవమై కనిపించాడు. శరీరంపై ఒక్క బుల్లెట్టు గాయం కూడా లేదు. కానీ, తారీఖ్ను చిత్రవథ చేసి చంపిన ఆనవాళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు గ్రామస్థులు.
తండ్రి వస్తాడు, కుబుర్లు చెబుతాడని ఎదురు చూస్తున్న నిస్సా కళ్లకు ఆ తండ్రి శవం కనిపించినప్పుడు.. ఆ పసి గుండె శోకం తీరేనా? సరిహద్దులో బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్న అమాయకుల దీన పరిస్థితి మారేనా?
ఇదీ చదవండి:ఆ కంపెనీలో 10వేలకుపైగా ఉద్యోగులు క్వారంటైన్