జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో జులై 18న జరిగిన వివాదాస్పద ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకుల కుటుంబాలను కలిశారు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
రాజౌరీకి వెళ్లేందుకు 6 గంటలు ప్రయాణించారు ఎల్జీ. అనంతరం దాదాపు 2 కిలోమీటర్లు నడిచి మృతుల స్వస్థలమైన తర్కస్సి గ్రామానికి చేరుకున్నారు.
అసలు ఏమైంది?
జులై 18న షోపియాన్ జిల్లా అమ్షిపురా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. అయితే.. ఆ ముగ్గురు జమ్ములోని రాజౌరీ జిల్లాకు చెందినవారని, అమ్షిపురాలో తప్పిపోయారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. అమ్షిపురాలోని యాపిల్, వాల్నట్ తోటల్లో కూలీలుగా పనిచేసే ఆ ముగ్గురు కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు జులై 17న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విచారణ జరిపింది సైన్యం. జులై 18న జరిగిన ఆపరేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆమోదించిన నిబంధనావళిని జవాన్లు ఉల్లంఘించారని గుర్తించింది. ఆ ముగ్గురికి ఉగ్రవాదంతో సంబంధం ఉందా లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెల ఆ ముగ్గురి డీఎన్ఏ వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోలి ఉన్నాయని బయటపడింది. దీంతో, ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాన్నారు గవర్నర్ సిన్హా.
ఇదీ చదవండి: పీయూష్ గోయల్‌కు పాసవాన్ బాధ్యతలు