ఎమ్మెల్యేల మాయం, రాజీనామాలు, రాజకీయ సంక్షోభం, అనూహ్య పరిణామాల తర్వాత మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామా చేశారు. కమల్‌నాథ్ రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుతీరేందుకు మార్గం సుగమం అయింది. త్వరలోనే భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటివరకు ఈ పదవికి ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి భాజపా సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపైనే.
శివరాజ్ సింగ్ చౌహాన్... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మరోసారి ఆయనే రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ పదవికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్లూ వినిపిస్తున్నాయి.
అధిష్ఠానం శివరాజ్ వైపే మొగ్గుచూపుతుందని పార్టీలో చాలామంది విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
- రాష్ట్రంలో చౌహాన్ కన్నా ప్రజాకర్షణ నేత భాజపాలోనే లేరు.
- ఆయనకు ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి.
- శివరాజ్ నాయకత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లను సాధించింది.
- 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి శివరాజ్‌ను మించిన నేత లేరని పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు.
- నిమ్న వర్గాల నుంచి వచ్చి రాష్ట్ర సీఎంగా 2018 వరకు వరుసగా 13 సంవత్సరాలు చౌహాన్ పాలించారు.
- ఆయన కార్యదీక్ష కారణంగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి అప్పజెప్పింది భాజపా అధిష్ఠానం.
- ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఎదురీదిన నేపథ్యంలో స్థానికంగా పట్టున్న నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
- కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన వెంటనే రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు చౌహాన్.
వీటన్నింటి కారణంగానే మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్‌కు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదీ చూడండి: కమల్‌నాథ్ రాజీనామా- ఎంపీలో ఇక కమలం సర్కార్!