సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) భద్రతను తొలగించడాన్ని శివసేన తప్పుపట్టింది. వ్యక్తుల భద్రత విషయంలో రాజకీయ కారణాలను పక్కనబెట్టాలని హితవు పలికింది. ఇతరుల జీవితాలతో ఆటలాడొద్దని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది.
"దిల్లీ అయినా, మహారాష్ట్ర అయినా... ప్రజలు భయం లేకుండా బతకగలిగే వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణం ఏర్పాటు చేయడం పాలకుల బాధ్యత. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు భద్రత తొలగించినా ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఇతర శాఖల మంత్రులు మాత్రం తమ భద్రత వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గాంధీలకు చెందిన వాహనశ్రేణిలో పాత వాహనాలను చేర్చడం కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ప్రధాని దీనిపై దృష్టి సారించాలి."-సామ్నా పత్రిక సంపాదకీయంలోని భాగం.
ఎవరున్నా ఇదే అభిప్రాయం
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యోదంతాలను శివసేన ప్రస్తావించింది. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరిగిన తర్వాతే ఎస్పీజీ భద్రతను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. శ్రీలంకతో శాంతి ఒప్పందం సమయంలోనే రాజీవ్‌గాంధీ భద్రతపై పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేసినట్లు గుర్తుచేసింది. గాంధీ కుటుంబ భద్రతకు ముప్పు లేదని ఎలా నిర్ధరించారని ప్రశ్నించింది. సోనియా, రాహుల్, ప్రియాంక స్థానంలో మరెవరున్నా.. తాము ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారమని చెప్పుకొచ్చింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలకు కేంద్రం ఎస్పీజీ భద్రతను ఉపసంహరించింది. వారి ముగ్గురికీ కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ద్వారా జడ్ ప్లస్ శ్రేణి భద్రత కొనసాగిస్తున్నారు. ఎస్పీజీ ఉపసంహరణలో భాగంగా వాహనశ్రేణిలోని కొత్త వాహనాలను తొలగించి.. పదేళ్ల నాటి ఎస్‌యూవీలను కేటాయించారు.