మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా జన్మస్థానం వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. సమస్యను పరిష్కరించే దిశగా.. సంబంధిత పక్షాల ప్రతినిధులతో ఇవాళ సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. మధ్యాహ్నం 2 గంటలకు ముంబయిలో భేటీ జరగనుంది. చర్చలకు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో.. శిరిడీ వాసులు కాస్త శాంతించారు. బంద్‌ను ఆదివారం అర్ధరాత్రి నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా.. నేడు శిరిడీలో యథావిధిగా కార్యకలాపాలు సాగనున్నాయి.
చర్చల్లో సంతృప్తికర పరిష్కారం లభించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు స్థానిక ప్రతినిధులు. సీఎంతో జరిగే సమావేశంలో పాథ్రీ, శిరిడీ నుంచి ప్రతినిధులు, స్థానిక భాజపా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాటిల్, సాయిబాబా సంస్థాన్ ట్రస్ సీఈఓ సహా శిరిడీ ఎంపీ పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయంతో బంద్.. విరమణ...
పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్ల కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించగా ఈ వివాదం మొదలైంది. సాయి జన్మస్థలం పాథ్రీ అనడానికి సరైన ఆధారాల్లేవని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతోనే ఆదివారం శిరిడీ బంద్ పాటించారు.
ఇదీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం