కేరళ కొజికోడ్‌లో వ్యాప్తి చెందిన షిగెల్లా వ్యాధి అదుపులోనే ఉందని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ స్పష్టం చేశారు. 50 మంది అనుమానితులను పరీక్షించగా కేవలం ఆరుగురికి మాత్రమే వ్యాధి నిర్ధరణ అయిందన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని, మిగిలిన వారు కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు.
"షిగెల్లా వ్యాధి కలుషిత నీటిలో ఉండే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. గతేడాది కొజికోడ్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలింది. ఈ సంవత్సరం కొజికోడ్ కార్పొరేషన్, మయనాడ్, కొత్తంపరంబ ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది. షిగెల్లా వ్యాధిపై ఆరోగ్య శాఖ అవగాహన సదస్సును సైతం నిర్వహించింది. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లోని బావులను శుభ్రపరిచాం. "
--కేకే శైలజ, కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో షిగెల్లా వ్యాధి వ్యాప్తి ఎక్కువని తెలిపారు శైలజ. ప్రజలు వేడినీటినే తాగాలని ఆరోగ్య శాఖ సూచించిందని గుర్తుచేశారు.