ఆర్య రాజేంద్రన్ తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్. తల్లి శ్రీలత ఎల్‌ఐసీ ఏజెంట్. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే 'బాలసంఘం'లో చేరింది ఆర్య. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పది లక్షలమంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేయడమే ఈ సంస్థ లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్రంగా ఆలోచించే గుణాన్ని పెంచింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే కాలేజీలోనూ తోటి విద్యార్థుల్లో చైతన్యాన్ని రగిలిస్తుండేది ఆర్య. మరోవైపు బాలసంఘం తరఫున కూడా చురుగ్గా సేవలందిస్తుండటంతో సీపీఐ(ఎం) ఈమెను బాలసంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.
గ్రామీణ ప్రాంతాలపై దృష్టి..
బాలసంఘానికి రాష్ట్రాధ్యక్షురాలిగా నియమితురాలైన ఆర్య తన బాధ్యత మరింత పెరిగిందని భావించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థుల బాగుకై పరితపించింది. వారిని బృందాలుగా తయారుచేసి గ్రామీణ అవసరాలపై ఓ అవగాహన తీసుకువచ్చే దిశగా కృషి చేసింది. సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను, గ్రామాభివృద్ధి అంశాలను పాలకుల ఎదుట ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేలా వారిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపింది. తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోన్న ఆర్య అభివృద్ధికి బాటలు వేయాలంటే రాజకీయాలే సరైన వేదిక అని భావించింది.
రెండువేలకు పైగా మెజార్టీ..
ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదవన్‌ముకల్ వార్డుకు సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో భాగంగా అనేక అభివృద్ధి విషయాలతో పాటూ ప్రాథమిక పాఠశాలలపై ప్రధానంగా దృష్టిసారించింది. ఆమె ఎంచుకున్న అభివృద్ధి అంశాలు ప్రజలకు నచ్చడంతో ఆర్యకు పట్టంకట్టారు ప్రజలు. రెండువేలకు పైగా ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయాన్ని సాధించింది. చక్కని రాజకీయ దృక్పథం ఉన్న ఆర్యను మేయర్‌ని చేయాలని రాజకీయ పార్టీలు ఆసక్తిచూపిస్తున్నాయి. అదే జరిగితే దేశంలోనే అతిచిన్నవయసు మేయర్‌గా రికార్డు సాధించడం ఖాయం. ''మా తిరువనంతపురం అందమైన నగరం. ఒక వేళ నేను మేయర్‌ని అయితే వ్యర్థాలు మా నగర అందాల్ని దెబ్బతీయకుండా చూస్తాను. అందరికీ ఆరోగ్యం అందాలనేది నాలక్ష్యం. నా చదువునీ కొనసాగిస్తా'' అని చెబుతోంది ఆర్య.
ఇదీ చదవండి: క్రిస్మస్ రోజున పోర్చుగల్‌ను ముంచెత్తిన వరద