అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహూర్తం సరైంది కాదని శంకరాచార్య జ్యోతిష్యపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. 'మేం రాముడి భక్తులం. రామ మందిరం ఎవరు నిర్మించినా సంతోషిస్తాం. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. ఆలయ నిర్మాణం సక్రమంగా జరగాలనేది మా అభిమతం. భూమి పూజ కూడా శుభ ఘడియల్లో జరగాలి. అందుకోసం సరైన తేదీ, సమయం ఎంచుకోవాలి. ప్రస్తుత భూమి పూజ కోసం నిర్ణయించిన ముహూర్తం మంచిది కాదు' అని చెప్పారు.
రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు అభ్యర్ధన మేరకు రామమందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. కోర్టు తీర్పు అనంతరం రామమందిరం ప్రాంతంతో పాటు, అయోధ్యలో ప్రధాని మొదటిసారి పర్యటించనున్నారు. ఆగస్టు 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో స్వరూపానంద వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటుపై కూడా ఆయన విమర్శలు చేశారు.