దిల్లీలోని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను అమిత్ షా సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు గంటలపాటు కార్యాలయంలో ఉన్న షా.. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వి.కె. జోహ్రీ నేతృత్వంలోని సీనియర్ అధికారులతో సంభాషించారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టిన అమిత్ షా... బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.
సరిహద్దుల్లో బలగాల మొహరింపు, కార్యకలాపాల అంశాలను హోంమంత్రికి అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత్-పాకిస్తాన్, ఇండో-బంగ్లా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు.
సరిహద్దులో అక్రమ చొరబాట్లు, రవాణా కార్యకలాపాలను తనిఖీ చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు అమిత్ షాకు వివరించారు. ఇప్పుడున్న స్మార్ట్ టెక్నాలజీ సాయంతో సరిహద్దుల్లో భద్రతను మరింత మెరుగు పరిచే దిశగా అడుగులేయాలని హోంమంత్రి సూచించారు. వాటితో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో బలగాల మొహరింపుపైనా చర్చించారు.
ఇదీ చూడండి:- 'పౌర' సెగ: కోల్కతాలో జాతీయ రహదారి దిగ్బంధం