కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం (సీఏఏ)కు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు అండగా ఉండాలన్నారు.
పౌరసత్వ చట్టానికి మద్దతుగా బిహార్లోని వైశాలిలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు షా. ప్రజలను తప్పుదోవపట్టించటం మానుకోవాలని హితవు పలికారు.
"పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ శరణార్థులు వచ్చారు. అలాంటి వారందరికీ పౌరసత్వం కల్పించేందుకే పౌరసత్వ చట్టాన్ని సవరించాం. దీనిపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోన్న కొందరు నేతలు.. ప్రజల్లో వ్యతిరేకత సృష్టిస్తూ... వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశంలోని మైనారిటీలు, యువతకు మీ పౌరసత్వం పోతుందని అసత్యాలు చెబుతున్నారు. బిహార్లోని ముస్లిం సోదరులకు దీనిపై స్పష్టత ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చాను. ఈ చట్టాన్ని పూర్తిగా చదవండి. రాహుల్ బాబా.. మీకు, మీ లాలూ ప్రసాద్ యాదవ్కు చెప్పేందుకు వచ్చాను. ప్రజలను తప్పుదోవ పట్టించటం మానుకోండి. మమత, కేజ్రీవాల్ మీరూ.. ప్రజలను తప్పుదోవ పట్టించటం ఆపండి.
పౌరసత్వ చట్టం ఎవరి పౌరసత్వాన్ని తొలగించే విధంగా రూపొందించలేదు. పౌరసత్వం ఇవ్వడానికే తీసుకొచ్చాం. భాజపా కార్యకర్తలంతా ఇంటింటికీ తిరుగుతూ.. సీఏఏపై నిజాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలైన సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిర్ నిర్మాణం వంటి వాటికి ప్రజలు మద్దతుగా నిలబడాలని కోరుతున్నా."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
నితీశ్ నేతృత్వంలోనే ఎన్డీఏ...
బిహార్లోని ఎన్డీఏలో అసమ్మతి నెలకొందన్న వార్తలను ఖండించారు అమిత్ షా. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే కూటమి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పతంలో దూసుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు షా.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!