నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గత ఐదేళ్లల్లో హింస గణనీయంగా తగ్గిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. వామపక్ష తీవ్రవాద సమస్యపై దిల్లీలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. నక్సల్స్ ఏరివేతకు చేపడుతున్న కార్యకలాపాలు, ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు.
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ సీఎంలు పాల్గొన్నారు. పారా మిలటరీ దళాల ఉన్నతాధికారులు, హోంశాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
2009 నుంచి 2013 వరకు దేశంలో 8 వేల 782 నక్సల్ హింస కేసులు నమోదైతే.. 2014 నుంచి 2018 వరకు 4 వేల 969 కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2009 నుంచి 2013 వరకు 3,326 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 2014-18లో 1,321 మంది మరణించారని తెలిపింది.
స్థిరమైన ప్రభుత్వ విధానాలతో వామపక్ష తీవ్రవాదం క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వెయ్యి కోట్లతో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు.
ఇదీ చూడండి: మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రత తొలగింపు