పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే.. కరోనా వైరస్ భయంతో పలువురు ఎంపీలు ఈ సమావేశాలకు దూరంగా కానున్నారని సమాచారం. కరోనా బారిన పడకుండా ఉండేందుకు సమావేశాలకు దూరంగా ఉండాలని భావిస్తోన్న ఎంపీల్లో ఎక్కువ మంది లెఫ్ట్, టీఎంసీ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.
సోనియా, మన్మోహన్..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(87).. సమావేశాల తొలిరోజు హాజరై మిగతా రోజులు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సమావేశాలకు హాజరుకారని వెల్లడించాయి. వారితో పాటు ఏకే ఆంటోనీ, వయలార్ రవి వంటి సీనియర్ నేతలు రెగ్యులర్గా హాజరుకాలేమని ఇప్పటికే సూత్రప్రాయంగా వెల్లడించారు.
రిస్క్ ఉన్నవారు..
ఇతర సీనియర్ చట్టసభ్యులు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వైరస్ బారినపడే ప్రమాదం అధికంగా ఉన్నవారు కూడా పార్లమెంట్ సమావేశాలకు దూరమవనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక ఏర్పాట్లు..
కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోక్సభలో 257 మంది, గ్యాలరీలో 172 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు హాల్లో, 51 మంది గ్యాలరీలో కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేపట్టారు.
పార్లమెంట్ సమావేశాలకు సభ్యులను ఆన్లైన్ లేదా భౌతికంగా హాజరయ్యేందుకు అనుమతించాలని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సూచించింది. కానీ, దానిపై ప్రభుత్వం స్పందించలేదు.
ఇదీ చూడండి: పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంటులోకి అనుమతి