దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా డోసుల కొనుగోలు కోసం ఆర్డర్లు ఇచ్చింది. కోటి 10 లక్షల డోసుల కోసం భారత ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చినట్లు ఆక్స్ఫర్డ్ టీకా ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వ అధీనంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. కేంద్ర వైద్య శాఖ తరపున టీకాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా జీఎస్టీతో కలిపి రూ.210కి అందుబాటులో ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఉదయానికి టీకా రవాణా ప్రారంభమవుతుందని తెలిపాయి. డోసులను తొలుత 60 కేంద్రాలకు చేర్చనున్నట్లు స్పష్టం చేశాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేయనున్నట్లు పేర్కొన్నాయి.
అత్యవసర అనుమతులు లభించిన మరో కొవిడ్ టీకా.. కొవాగ్జిన్ డోసుల కోసం కూడా త్వరలోనే కేంద్రం ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు సోమవారం సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
'ముందుకు రండి'
మరోవైపు, స్వచ్ఛందంగా కరోనా టీకా స్వీకరించేందుకు ముందుకు రావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తన 3.5 లక్షల మంది సభ్యులను అభ్యర్థించింది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరింది. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓతో చర్చించిన తర్వాత టీకా పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎంఏ బ్రాంచీలు టీకా పంపిణీ కోసం సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేసింది. టీకా తీసుకురావడంలో విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది. ఆధునిక వైద్య రంగంలో పరిశోధనల ద్వారా భారత్ సూపర్ పవర్‌గా అవతరించనుందని పేర్కొంది.
ఇదీ చదవండి: