సురక్షితమైన కరోనా వ్యాక్సిన్ను ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఎలాంటి హడావుడి లేదని పేర్కొన్నారు.
మైల్యాబ్స్ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసిన 'కాంపాక్ట్ ఎక్స్ఎల్' డయాగ్నోస్టిక్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమర్థమంతమైన వ్యాక్సిన్ తయారీపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.
"సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ రూపొందిస్తామని మేము ఆశిస్తున్నాం. మూడో దశ ట్రయల్స్ గురించి ఓసారి చర్చిస్తాం. ఎవరో వ్యాక్సిన్ను హడావుడిగా తయారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మాకు ఎలాంటి హడావుడి లేదు. భద్రత, సమర్థతకు మేం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. సురక్షితమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన నమ్మకం మాకు కలిగితే తప్పకుండా దాని గురించి ప్రకటిస్తాం. కానీ దానికి ఆరు నెలల సమయం ఉంది."
-అదర్ పూనావాలా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ
వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమని పూనావాలా పేర్కొన్నారు. అందుకే మైల్యాబ్స్లో ఎస్ఐఐ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. భారత్లో సరిపడా పరీక్షలు జరగడం లేదని అన్నారు. కేసులు పెరుగుతాయన్న భయం ఉండకూడదని సూచించారు.
ఓకే అంటే ఎగుమతి చేస్తాం..!
మైల్యాబ్స్ సహా ఇతర సంస్థలు తమ ఉత్పత్తి (టెస్టింగ్ కిట్ల) సామర్థ్యాలను ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాయని అన్నారు పూనావాలా. వారానికి 20 లక్షల టెస్టింగ్ కిట్లను మైల్యాబ్స్ తయారు చేస్తోందని తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన కిట్లు నిల్వచేసిన తర్వాత.. విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు.
ఇదీ చదవండి- 'దలైలామాకు ఆతిథ్యమిస్తున్న భారత్కు కృతజ్ఞతలు'