దాదాపు అయిదు దశాబ్దాలుగా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమై ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. దీనిపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ (ఔషధ పరీక్షలు) మొదలు పెట్టినట్లు సంస్థ సీఈఓ అదార్ పూనావాలా 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సరైన ఔషధం, తగిన చికిత్సా విధానాలు లేకపోవటానికి తోడు శరవేగంగా విస్తరించేది కావటం వల్ల కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోందని, మానవాళి మనుగడకే ప్రమాదకరంగా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటమే పరిష్కారమని పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకిన వారికి కొన్ని చోట్ల యాంటీ-వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నప్పటికీ అవి పనిచేస్తున్నదీ లేనిదీ స్పష్టంగా తెలియటం లేదని, కాకపోతే అటువంటి యత్నాల ద్వారా ఈ వ్యాధికి తగిన ఔషధాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు పడవచ్చని పేర్కొన్నారు. కానీ వ్యాక్సిన్ ద్వారా దీన్ని కట్టడి చేసే అవకాశం ఉందని, అందుకే ఆ దిశగా తాము ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి స్థితిగతులు, వ్యాక్సిన్ తయారీ అవకాశాలు, ఇతర అంశాలను ఆయన ఆ సందర్భంగా వివరించారు.
కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) ప్రపంచాన్ని ఎందుకు ఇంతలా భయపెడుతోంది?
ఒకరి నుంచి ఎంతోమందికి అమితమైన వేగంతో విస్తరించటం కరోనా వైరస్ ప్రత్యేకత. అందుకే దీనికి అంతగా భయపడవలసి వస్తోంది. కేవలం రోజుల వ్యవధిలో ఎన్నో దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ‘పాజిటివ్’ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ముందు జాగ్రత్తే మందు. ప్రజలు, ప్రభుత్వాలు కలిసి అప్రమత్తంగా వ్యవహరించటం ద్వారా ఈ ఉపద్రవం తప్పిపోయేటట్లు చూసుకోవాలి.
మీ దృష్టిలో ఈ వ్యాధికి చికిత్స చేసే మార్గాలు, అవకాశాలు ఏమిటి?
కరోనా వైరస్ వ్యాధికి తగిన చికిత్సా విధానాలను ఆవిష్కరించటానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇంకా స్పష్టమైన విధి విధానాలు, పరిష్కార మార్గాలు అందుబాటులోకి రాలేదు. బాధ్యత గల సంస్థగా మేం జాతీయ- అంతర్జాతీయ వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థల నుంచి తాజా సమాచారాన్ని సేకరిస్తున్నాం. దానికి తగ్గట్లుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం.
కరోనా వైరస్ సోకిన వారికి కొన్ని దేశాల్లో హెచ్‌ఐవీ/ ఎయిడ్స్, మలేరియా, స్వైన్‌ఫ్లూ ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. దీని వల్ల ఫలితం ఉంటుందా? ఈ ఔషధాలు ఆధారంగా కరోనా వైరస్‌ను అదుపు చేసే మందు కనిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారా?
ఇంతకు ముందే చెప్పినట్లు ఈ వ్యాధికి స్పష్టమైన చికిత్సా విధానం కానీ, ఔషధం కానీ లేదు. అందువల్ల వివిధ దేశాల్లో ప్రభుత్వం, ఆస్పత్రులు అందుబాటులో ఉన్న ఔషధాలను ప్రయోగించి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ... ఒక ప్రయోగం చేస్తున్నట్లుగా భావించవచ్చు. ఏదో ఒక మందు పనిచేస్తే దాని ఆధారంగా ఈ వ్యాధిని అరికట్టే అవకాశం వస్తుందనేది ఆయా వర్గాల ఆశ. శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యే వరకూ ఏమీ చెప్పలేం.
దీనికి వ్యాక్సిన్ కనుగొనే అవకాశం ఉందా?
అవును, అవకాశం ఉంది. ఇతర వైరస్‌లు, వైరస్‌తో వచ్చే వ్యాధులకు వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లే కరోనా వైరస్ వ్యాధికి కూడా వ్యాక్సిన్‌ను ఆవిష్కరించవచ్చనేది మా విశ్వాసం.
వ్యాక్సిన్ తయారు చేసే దిశగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది?
కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే యత్నాలను ఇప్పటికే మేం మొదలు పెట్టాం. ఈ విషయంలో ‘కోడాజెనిక్స్’ అనే అమెరికా బయోటెక్నాలజీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం. వ్యాక్సిన్ కేండిడేట్ (మూలకణం) ను ఇప్పటికే గుర్తించి క్లినికల్ పరీక్షలు చేపట్టాం. ప్రస్తుతం ప్రీ-క్లినికల్ (జంతు ప్రయోగాలు) దశలో ఇది ఉంది. వచ్చే నాలుగైదు నెలల్లో హ్యూమన్ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగాలు) మొదలు పెట్టే అవకాశం ఉంది.
క్లినికల్ పరీక్షలను పలు దేశాలతో పాటు చైనాలో నిర్వహించే ఆలోచన కూడా ఉంది. మా లేబొరేటరీలో రూపుదిద్దుకున్న సింథటిక్ వైరస్ ద్వారా ‘వ్యాక్సిన్ కేండిడేట్’ను ఆవిష్కరించాం. ఈ సింథటిక్ వైరస్, అసలైన ‘కరోనా వైరస్’ను పోలినట్టే ఉంటుంది. వ్యాక్సిన్ తయారీలో ఇదే ఒక పెద్ద విజయం. దీనివల్ల వ్యాక్సిన్‌కు తుది రూపం ఇవ్వటానికి పట్టే సమయం ఎంతో తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాదిన్నర-రెండేళ్ల వ్యవధిలో వ్యాక్సిన్‌కు పూర్తి రూపం ఇచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి మేం దాదాపు రూ.300 కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాం.
మీరు భారత వ్యాక్సిన్ తయారీదార్ల సంఘం (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాధిపై పోరాటంలో పరిశ్రమ ప్రతినిధిగా ప్రభుత్వంతో ఏ విధంగా పనిచేస్తున్నారు?
ఈ దశలో ప్రభుత్వానికి అండ ఎంతగానో అవసరం. పరిశ్రమ తరఫున మా వంతుగా ప్రభుత్వంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. ఈ వ్యాధి విస్తరించకుండా తీసుకోవలసిన చర్యలు, ఉపశమనం కలిగించే మందుల లభ్యత... వంటి అంశాల పరంగా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా చూడటంతో పాటు వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలని, కొత్త కేసులు నమోదు కాని పరిస్థితిని సాధించాలని భావిస్తూ, అందుకు అన్ని రకాలుగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం.
ఇదీ చూడండి : పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం పెంపుపై కాంగ్రెస్ ఫైర్