కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హన్సరాజ్ భరద్వాజ్ (83) కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావటం వల్ల ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
మూత్ర పిండాల సమస్యతో గత బుధవారం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నిఘమ్బోధ్ ఘాట్లో సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా విధులు నిర్వర్తించారు హన్సరాజ్. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మోదీ సంతాపం..
హన్సరాజ్ భరద్వాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
భరద్వాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి..
హన్సరాజ్ భరద్వాజ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. పార్లమెంట్లో ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ఉగ్ర సంస్థతో సంబంధాలున్న దంపతుల అరెస్ట్!