సమావేశాలు, సంప్రదింపులు, చర్చలతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. మహా ప్రతిష్టంభన, రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న తరుణంలో ఈ నెల 22న ముంబయిలో తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనుంది శివసేన. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ-కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో శివసేన భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యచరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
"ఈ నెల 22న పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశంకానున్నారు. ఇందులో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించనున్నారు. భవిష్యత్ కార్యచరణతో పాటు నూతన ఎమ్మెల్యేలతో మాట్లాడతారు."
--- శివసేన నేత.
అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమికి మెజారిటీ లభించింది. ముఖ్యమంత్రి పీఠంపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కమల దళంతో సేన తెగదెంపులు చేసుకుంది. అనంతరం.. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపింది. ఎన్నికల ఫలితాలు విడుదలై 27 రోజులు గడిచినా... ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఉండిపోయింది.
ఇదీ చూడండి:- టికెట్టు తీసుకోలేదని బస్సు నుంచి తోసేశాడు!