సెల్ఫీలకు ఉన్న క్రేజే వేరు. వింత వింతగా సెల్ఫీలు దిగడం... వాటిని వెంటనే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం సాధారణ విషయం. కానీ ఈ స్వీయచిత్రాల మోజుతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో యువతే అధికం. ప్రపంచవ్యాప్తంగా సొరచేపల దాడుల్లో మృతిచెందిన వారి కన్నా సెల్ఫీ మరణాలు ఐదు రెట్లు ఎక్కువ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
యువకులే ఎక్కువ...
2011 అక్టోబర్- 2017 నవంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 259 మంది సెల్ఫీలు తీసుకుంటూ మృత్యు ఒడికి చేరారు. ఈ సమయంలో 50 మంది మాత్రమే సొరచేపల దాడుల్లో కన్నుమూశారని భారత్కు చెందిన 'ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్' జర్నల్ తెలిపింది.
ఫొటోలు తీసుకునే వారిలో మహిళలే ఎక్కువ ఉన్నప్పటికీ... సెల్ఫీ మరణాల్లో 75శాతం మంది పురుషులు ముఖ్యంగా యువకులే ఉన్నారు. సెల్ఫీల కోసం అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు.
భారత్ టాప్...
ఈ తరహా మరణాల్లో అగ్రస్థానంలో నిలిచింది భారత్. 159 మంది మన దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఖ్యతో పోలిస్తే సగానికి పైనే. దేశంలో పరిస్థితి ఎలా ఉందటే.. ముంబయిలోని 16 ప్రాంతాల్లో 'నో సెల్ఫీ' జోన్ ఏర్పాటు చేశారు.
రష్యాలో సెల్ఫీ మరణాల సంఖ్య 16. అమెరికాలో 14.
ప్రమాదకర రీతిలో...
ఫొటోలు దిగేటప్పుడు కొంతమంది ప్రాణాలనూ లెక్కచేయడం లేదు. సెల్ఫీ దిగుతుండగా ట్రైన్ ఢీకొనడం భారత్లో తరచూ జరుగుతున్నాయి.
రష్యాలో సెల్ఫీల కోసం ప్రమాదకర రీతిలో ప్రయత్నించి ఎత్తైన భవనాలు, వంతెనల పైనుంచి కింద పడుతున్నారు. అమెరికాలో ఇంకా దారుణ పరిస్థితి నెలకొంది. పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం తమను తాము కాల్చుకుంటున్నారు.
ఇందులో మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. ఏదైనా దుర్ఘటన జరిగితే స్పందించకుండా సెల్ఫీలు దిగడం పరిపాటిగా మారింది. కొంత మందైతే రోడ్డు ప్రమాదాలను చిత్రీకరించడం, బాధితుల వద్ద నిల్చొని సెల్ఫీలు దిగుతూ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.