ఛత్తీస్‌గఢ్.. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ శాంతిభద్రతలను కాపాడడం కత్తి మీద సామే. అయితే ప్రజలను రక్షించాల్సిన జవాన్లే ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సహొద్యోగులనూ కాల్చిచంపేస్తున్నారు. అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
రెండేళ్లలో 50...
ఛత్తీస్గఢ్వ్యాప్తంగా 2007-2019 మధ్య కాలంలో 201మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 31మంది.. కేవలం 2019లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఏడాది జూన్ నాటికి ఆ సంఖ్య 6.
గత రెండేళ్ల వ్యవధిలో పోలీసులు, పారామిలిటరీ దళాల సిబ్బంది కలిపి మొత్తం 50మంది భద్రతా సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో మావోయిస్ట్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ నుంచే 18 ఘటనలు నమోదయ్యాయి.
సహొద్యోగులపై విరుచుకుపడి.. వారి ప్రాణాలు తీస్తున్న జవాన్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మేలో.. ఓ సీఏఎఫ్(ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం) జవాను.. మరో ఇద్దరు సహొద్యోగులను కాల్చిచంపేశాడు. ఫిబ్రవరిలో.. ఇదే తరహాలో మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది డిసెంబర్లో ఏకంగా 8 మంది ఐటీబీపీ జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు ఓ సహొద్యోగి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.
ఎందుకిలా జరుగుతోంది?
మావోయిస్ట్ ప్రాంతాల్లో శాంతిభద్రతలను రక్షించాలంటే.. పెద్ద యుద్ధమే చేయాలి. నిత్యం అప్రమత్తంగా ఉంటూ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అడవుల్లో అనేక గంటల పాటు విధులు నిర్వర్తిస్తూనే ఉండాలి. బస్తర్, కంకేర్, కొండగావ్, జగ్దల్పుర్, దంతెవాడ, సుక్మా, బీజాపుర్, నారాయణ్‌పుర్ జిల్లాల్లో పరిస్థితులు ఊహకందని విధంగా, దారుణంగా ఉంటాయి.
వీటన్నిటికి తోడు.. జవాన్లు ఇళ్లకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. ఈ క్రమంలోనే వారిపై తీవ్ర ఒత్తిడి పడుతోందని.. ఫలితంగా వారు అత్మహత్య చేసుకోవడమో, సహొద్యోగులపై కాల్పులు జరపడమో చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"చాలా కాలం వరకు విధులు నిర్వహించాలని భద్రతా సిబ్బందికి అర్థమైతే.. వారి దృష్టి కుటుంబసభ్యులవైపు మళ్లుతుంది. వారిని కలుసుకోలేరని బాధపడుతుంటారు. ఫలితంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. చాలా మందికి సెలవులు కూడా దొరకడం లేదు."
-- డా. వర్ణిక శర్మ, సామాజిక కార్యకర్త, నక్సల్స్ వ్యవహారాల నిపుణులు
ఇలా ఒత్తిడిలో ఉన్న జవాన్లకు కౌన్సెలింగ్ అవసరమని.. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని అన్నారు సైకియాట్రిస్ట్ డా. జేసీ అజ్వాని.
"ఓ జవాను సహోద్యోగిని హత్య చేశాడనే కోణంలో మనం దీనిని చూడకూడదు. వీటిని ఎంతో వ్యక్తిగతంగా పరిగణిస్తారు. ఎవరైనా మానసికంగా దెబ్బతిన్నట్టు అనిపిస్తే.. అధికారులు వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. ఒత్తిడిని సులభంగా జయించే విధంగా వారికి శిక్షణ ఇవ్వచ్చు."
-- జేసీ అజ్వాని, సైకియాట్రిస్ట్.
వినోదాత్మక కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు అజ్వాని. మెడిటేషన్, యోగా కూడా ఉపయోగపడుతుందన్నారు.
ప్రభుత్వ చర్యలు...
నిపుణుల సలహా మేరకు ఈ ఘటనలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. పోలీసు సిబ్బందిపై ఉన్న ఒత్తిడిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపిని ఆదేశించింది. కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని నిర్దేశించింది.
అయితే ప్రభుత్వం సైకియాట్రిస్ట్‌ను అందుబాటులో ఉంచినా.. జవాన్లు ఈ సేవలను వినియోగించుకోవడం సందేహంగా మారింది. తమ పరిస్థితిని బయటపెట్టడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. 2014లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. దేశంలోని 96శాతం మంది జవాన్లు.. తమ మానసిక ఆరోగ్య సమస్యలను ఇతరులతో చర్చించడానికి ఆసక్తి చూపలేదు.