ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. బాలాకోట్‌లో పాకిస్థాన్ మళ్లీ ఉగ్ర స్థావరాలను పునరుద్ధరించిందన్న సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ ప్రకటన నేపథ్యంలో స్పష్టతనిచ్చారు కేంద్ర మంత్రి.
భారత తీర రక్షక దళానికి చెందిన గస్తీ నౌక 'వరాహ'ను ప్రారంభించేందుకు చెన్నై నౌకాశ్రయానికి చేరుకున్నారు రాజ్‌నాథ్. ఈ సందర్భంగా బాలాకోట్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మంత్రి.
"ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే సత్తా మన సైన్యానికి ఉంది. సైన్యం, నావికా దళం, వైమానిక దళం పటిష్ఠంగా ఉన్నాయి. ఎలాంటి భయం అవసరం లేదు. మన బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఇదీ చూడండి: బాలాకోట్ ఉగ్ర శిబిరాన్ని పునరుద్ధరించిన పాక్
విధుల్లోకి 'వరాహ'
చెన్నై నౌకాశ్రయంలో బంగాళాఖాతం జలాల్లోకి గస్తీ నౌక 'వరాహ'ను ప్రవేశపెట్టారు రాజ్‌నాథ్ సింగ్. వరాహ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు భారత తీర రక్షక దళంతో పాటు ఎల్ అండ్ టీ షిప్‌యార్డ్‌కు అభినందనలు తెలిపారు. ఈ నౌకను ఎల్ అండ్ టీ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది.
సవాళ్లకు ఎదురీత
వరాహతో భారత తీర దళం సామర్థ్యం మరింత పెరగనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ రూపొందించిన రెండు ఇంజిన్ల ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను 'వరాహ' నిర్వహిస్తుంది. మాదక ద్రవ్యాల రవాణా, ఇంధనం లీకేజీ, సముద్ర జలాల ద్వారా ఉగ్రవాద చొరబాట్లు లాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వరాహ ఉపయోగపడనుంది.
హిందూ పురాణాల నుంచి 'వరాహ' పేరును తీసుకున్నారు.
ఇదీ చూడండి: కుప్పకూలిన మిగ్-21 విమానం.. పైలట్లు సురక్షితం