కొవిడ్-19 (కరోనా) వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల నుంచి తమ పౌరులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న మరికొంత మంది యాత్రికులను స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం.
నేడు రెండో విడతలో 44 మంది యాత్రికులు ప్రత్యేక విమానం ద్వారా ముంబయి విమానాశ్రయానికి చేరినట్లు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ తెలిపారు.
'ఇరాన్లో భారత వైద్య బృందం చక్కగా పనిచేస్తోంది. ఈ విషయంలో మద్దతుగా నిలిచిన ఇరాన్ అధికారులు, విమానయాన సంస్థకు అభినందనలు.'
- జయ్శంకర్, భారత విదేశాంగ మంత్రి
తొలి బృందంలో 58 మంది..
కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇప్పటికే తొలి బృందంలో 58 మంది భారత సందర్శకులను స్వదేశానికి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులు ఉన్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ తెలిపింది. వారందరినీ సురక్షితంగా భారత్కు తీసుకురావడమే తమ కర్తవ్యమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. త్వరలోనే మరో 120 మంది ప్రయాణికులను భారత్కు తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: కరోనా విజృంభణతో 'భారత్ బంద్' తరహా పరిస్థితి!