రఫేల్ ఒప్పంద వ్యవహారంలో సత్యమే విజయం సాధించిందని భాజపా వ్యాఖ్యానించింది. కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేసింది.
రఫేల్‌పై అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై దిల్లీలో విమర్శల వర్షం కురిపించారు భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. పార్లమెంటులో అబద్ధాలు చెప్పి... దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని ఆరోపించారు.
"రఫేల్ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం ఈరోజు తిరస్కరించింది. ఇది నిజం సాధించిన విజయం. దేశ భద్రత సాధించిన విజయం. మోదీ సర్కారు నిజాయతీగా తీసుకున్న నిర్ణయం సాధించిన విజయం. సత్యమే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. వాళ్లు అవినీతిలో కూరుకుపోయారు."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి.
కాంగ్రెస్ హయాంలో దేశరక్షణకు సంబంధించిన విషయాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు రవిశంకర్. జీపు కుంభకోణం నుంచి భోపోర్స్, జలాంతర్గామి, అగస్టా వెస్ట్‌లాండ్ ఛాపర్ల కొనుగోళ్ల వరుకు అవినీతి అంతకంతకూ పెరిగిందని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: కేంద్రానికి 'రఫేల్' ఊరట- మరోమారు సుప్రీం క్లీన్చిట్