దిల్లీలో అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభం ఇప్పుడే సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య దిల్లీలోని పాఠశాలలను మార్చి 7 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా ఈశాన్య దిల్లీలో వార్షిక పరీక్ష నిర్వహించే పరిస్థితులు కూడా లేనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల పరీక్షలను కూడా వాయిదా వేశారు.
పాఠశాలల్లో విధ్వంసం..
ఈ నెల 23న మొదలైన దిల్లీ అల్లర్ల కారణంగా తొలుత ఫిబ్రవరి 29 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఘర్షణల తీవ్రత కారణంగా వీటిని పొడిగిస్తూ నేడు నిర్ణయం తీసుకుంది.
ఘర్షణల్లో భాగంగా ఈశాన్య దిల్లీలోని చాలా పాఠశాలలను ధ్వంసం చేశాయి అల్లరిమూకలు. ఫర్నీచర్ విరిగిపోగా.. వేల పుస్తకాలు మంటల్లో కాలిపోయాయి.
న్యాయనిపుణులతో విచారణకు డిమాండ్
దిల్లీలో అల్లర్లపై విచారణ ఏకపక్షంగా జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. నిరసనకారులు, కార్యకర్తలపై తీవ్రమైన కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంది. ఈ కేసులకు సంబంధించి పరిశీలించేందుకు న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ.
"దిల్లీ సాధారణ పరిస్థితులకు చాలా దూరంలో ఉంది. దేశ రాజధాని ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. నాలుగు రోజుల పాటు దిల్లీ కాలిపోతుంటే చూస్తూ ఉండిపోయిన పోలీసులు.. ఇప్పుడు ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ చర్యలను పరిశీలించాల్సిన అవసరం ఉంది."
- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: దిల్లీ మెట్రో స్టేషన్లో 'పౌర' నినాదాలు