ఎన్నో ఏళ్లు ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్న అగ్రనేతలు... ఇప్పుడు ఒకే వేదికపై తమ ఐక్యమత్యాన్ని దేశానికి చాటిచెప్పారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దాదాపు 26 ఏళ్ల అనంతరం ఒకే వేదిక పంచుకున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లోని మైన్పురి ర్యాలీ వేదికైంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఎస్పీ- బీఎస్పీ కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్పీ వ్యవస్థాపకుడు పోటీ చేస్తున్న లోక్సభ స్థానంలో గురువారం భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ములాయం- మాయావతి తమ బలాన్ని ప్రదర్శించారు.
బీఎస్పీ అధినేత్రిని ఎల్లప్పుడూ గౌరవించాలని ఎస్పీ కార్యకర్తలకు సూచించారు ములాయం.
ఎస్పీ వ్యవస్థాపకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు మాయావతి. ఉత్తరప్రదేశ్వాసుల నిజమైన నాయకుడు ములాయమేనని కీర్తిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.
"సమాజ్వాదీ పార్టీ కోసం ములాయం ఎన్నో సేవలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడ్డారు. వెనకబడిన వర్గాల కోసం ఎనలేని సేవలందిచారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ములాయంనే తమ అసలైన నాయకుడని నమ్ముతారు. ములాయం సింగ్ యాదవ్ అసలైన బీసీ నాయకుడు. ప్రధాని మోదీలా నకిలీ బీసీ నాయకుడు కాదు. "
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని మరోమారు సమర్థించుకున్నారు మాయ. పార్టీ, ప్రజల ప్రయోజనాల కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తప్పదని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: "భాజపా ప్రభుత్వం పేదలకు వ్యతిరేకం "