ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దిల్లీ హైకోర్టు బెయిల్‌కు నిరాకరించినందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చిదంబరం.
ఆగస్టు 21న అరెస్టు
ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్టు చేసింది సీబీఐ. అనంతరం 15 రోజుల పాటు ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. ఆపై జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం తిహార్ జైలుకు తరలించారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి చిదంబరంపై దిల్లీకోర్టులో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్ఎక్స్ మాజీ ప్రమోటర్లు ఇంద్రాణి- పీటర్ ముఖర్జీలు సహా 14 మందిపై చార్జ్‌షీట్ దాఖలైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు
యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
వాదనలు వినిపించేది వీరే...
సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించనున్నారు. ఈ విషయంపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.