నల్లధన నిరోధక చట్టం-2016 అమలుపై దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం. 2015 జులై నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని నోటిఫికేషన్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దిల్లీ హైకోర్టు గతంలో స్టే విధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది కేంద్రం.
అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితుడైన గౌతమ్ ఖైతాన్పై ఆదాయపన్ను శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకుండా దిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం పేర్కొంది. ఖైతాన్ తరఫు న్యాయవాది ఎన్.కె.కౌల్ వారం రోజుల తరవాత విచారణ చేపట్టాలని దాఖలు చేసిన ఫిర్యాదును సోమవారం తోసిపుచ్చింది.
2016లో తీసుకొచ్చిన నల్లధనం చట్టం, ఆదాయపన్ను చట్టాలు.. జులై, 2015 నుంచి అమలు చేసేందుకు వీలులేదని గతంలో తేల్చింది దిల్లీ హైకోర్టు. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై ఏవిధంగా ఈ చట్టాన్ని అమలు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఖైతాన్పై ఎలాంటి చర్యలు చేపట్టరాదని మే 16న ఆదాయపన్ను శాఖను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ఈ కేసుపై విచారణను జులైకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: తమిళనాడులో 10 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు